టోక్యో: కరోనా వైరస్ పూర్తిగా అంతం కాకుంటే వచ్చే ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ను రద్దు చేస్తామని నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యషిరో మోరీ చెప్పారు. విశ్వక్రీడలను మరోసారి వాయిదా వేసే ప్రసక్తే లేదని మంగళవారం ఓ జపాన్ క్రీడా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు. “ఒలింపిక్స్‌ను మళ్లీ వాయిదా వేయాల్సిన పరిస్థితి వస్తే.. రద్దు చేసేస్తాం. ఇంతకు ముందు ప్రపంచ యుద్ధాల సమయంలోనే విశ్వక్రీడలు రద్దయ్యాయి. ప్రస్తుతం కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్‌తో పోరాడుతున్నాం. మానవజాతి మొత్తం యుద్ధం చేస్తున్నది. వైరస్ అంతమైతే తప్పకుండా విశ్వక్రీడలను విజయవంతంగా నిర్వహిస్తాం” అని యషిరో మోరీ తెలిపారు. ఈ ఏడాది జూలైలో ప్రారంభం కావాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా వైరస్ కారణంగా వచ్చే సంవత్సరానికి వాయిదా పడింది. తాజా షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు విశ్వక్రీడలు జరగాల్సి ఉంది.
కరోనా అంతం కాకుంటే ఒలింపిక్స్ రద్దే: మోరీ